ఏపీలో రేషన్ కార్డు దారులకు కీలక అప్డేట్.. ఇకపై వారికి కూడా
రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ తెలిపింది కూటమి ప్రభుత్వం. ఇటీవలె కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం సమయంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా మరికొంత మందిని కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాలోకి తీసుకొస్తున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వాళ్ల వివరాలు వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక అప్డేట్స్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఒంటరి, లింగమార్పిడి అయిన వాళ్లకు కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వివాహం కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లు.. ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులు.. అంతేకాక లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు తెలిపారు.
అంతేకాక రాష్ట్రంలో అంతరించి పోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారిని ఆదుకునేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆ కళాకారులకు ఇకపై అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం అందించనున్నట్లు వివరించారు. దుర్భల గిరిజన సమూహాలు (పీవీటీజీ) జాబితాలో ఉన్నవారికి కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఏలూరు, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో నివసించే 12 కులాల గిరిజనులు, చెంచులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఇక జూన్ నుంచి పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ ఆరు రకాల సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లబ్ధిదారులు 95523 00009 నంబరుకు 'హలో' అని టైప్ చేసి సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని ఇటీవల అధికారులు తెలిపారు.

కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షల లోపు ఉండాలి. అంతేకాక GSWS హౌస్ హోల్డ్ డేటా బేస్ నందు నమోదు అయి ఉండాలి వారిలో ఎవరికి రైస్ కార్డ్ ఉండరాదు. ఇక వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పులు చేసి సభ్యులను చేరుస్తారు. వివాహం ద్వారా.. వివాహ ధృవీకరణ పత్రంతో పాటు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. జననం ద్వారా అయితే జననం ధృవీకరణ పత్రం సమర్పించాలి. అంతేకాక చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు, ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications