ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మహిళలకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ విషయంలో తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ శుభవార్త చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ
ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన నాటి నుండి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించటంపై పదేపదే నిరీక్షణ తప్పటం లేదు. ఇక ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ తెలిపారు.

ఉచిత బస్సు పథకంపై మంత్రుల కమిటీ అధ్యయనం
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలుపరచడంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుందని ఆయన అన్నారు. వీలైనంత త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం పైన అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు.
ఉచిత బస్సు పథకం అమలుకు ఏర్పాట్లు
తాజాగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం అమలుతీరును పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన సూచనలు చేస్తుందని ఆయన తెలిపారు.ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. ఉచిత బస్సు పథకం అమలైతే రద్దీ విపరీతంగా పెరుగుతుందని, అందుకే ఆర్టీసీలో మరో రెండువేల బస్సులతో పాటు సిబ్బంది కావాలని ఆ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నామన్నారు.
నియామకాలు పూర్తి చేసి.. ఆపై
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కావలసిన అంశాల పైన పరిశీలించే ప్రతిపాదనలు పంపారని, అందుకు అనుగుణంగా అంతా సిద్ధమవుతుందన్నారు. ఆర్టీసీలో సిబ్బంది నియామకాలు కూడా పూర్తిచేసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications