42 గంటల జర్నీకి 3 సంవత్సరాలు పట్టింది... మన దగ్గరే!
వాస్తవానికి భారతీయ రైల్వే అంటేనే ఆలస్యంగా రైళ్లు నడుస్తాయనే ముద్ర పడిపోయింది. వీటిని మార్చి సకాలంలో గమ్యస్థానం చేరేలా చూడటానికి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరగడం, ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగడం, స్టేషన్ ప్లాట్ ఫామ్స్ ఖాళీ లేకపోవడంలాంటి కారణాలతో కనీసం తక్కువలో తక్కువగా గంట ఆలస్యమవుతోంది. మరికొన్నిసార్లు గంటల తరబడి ఆలస్యం జరుగుతోంది. ఘనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు ఇటీవలే 13 గంటలు ఆలస్యంగా నడిచింది. ప్రయాణికులకు అంతకంటే నరకం మరొకటి ఉండదు.
2014 నవంబరులో విశాఖ నుంచి బయలుదేరింది
ఈ కోవలోనే విశాఖపట్నం నుంచి బయలుదేరి ఓ గూడ్స్ రైలు 42 గంటలు ప్రయాణించి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంది. రైలు బయలుదేరడమైతే బయలుదేరిందికానీ గమ్యస్థానానికి చేరుకోవడానికి మాత్రం మూడు సంవత్సరాల సమయం తీసుకుంది. ఈ సమయంలో ఆ రైలు ఎక్కడుంది? ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది? అందులో ఉన్న సరుకు సంగతి ఏమిటి? తదితర వివరాలేవీ రైల్వే పట్టించుకోలేదు. 1400 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయడానికి మూడేళ్లు పట్టడంపై ప్రజలంతా ఆశ్చర్యపోయారు. 2014 నవంబరులో 1361 ఎరువుల బస్తాలను రామచంద్రగుప్తా అనే వ్యాపారి బుక్ చేసుకున్నారు. అవి విశాఖపట్నం నుంచి బస్తీకి చేరుకోవాలి. వాటి విలువ రూ.14 లక్షలు.

అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
రైలు ఎంతకీ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో రామచంద్రగుప్తా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు చర్యలు తీసుకోలేదు. అదిగో ఇదిగో అన్నారు. ఆ రైలు ఎక్కడుంది? ఎవరు లోకో పైలెట్ గా ఉన్నారు? ఎవరు గూడ్స్ గార్డుగా ఉన్నారు? ఏ స్టేషన్ లో నిలిచివుంది? తదితర వివరాలను కూడా ఆరాతీయలేదు. చివరకు గుప్తా ఒత్తిడితో అధికారులు అసలు ఈ రైలు ఎక్కడుంది? అనే విషయమై పరిశోధన ప్రారంభించారు. దీంతోపాటు ప్రభుత్వ పోలీసులు, రైల్వే పోలీసులు కూడా దర్యాప్తు సాగించారు. ఇవన్నీ జరిగిన తర్వాత చివరకు 2018 జులైలో ఈ రైలు ఎరువుల బస్తాలతో బస్తీ స్టేషన్ కు చేరుకుంది. అందులో ఉన్న ఎరువులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. భారతీయ రైల్వేలోనే అత్యంత చరిత్రాత్మకమైన సంఘటనగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈరోజుకు ఆ రైలు ఎందుకు ఆలస్యమైంది? అనే వివరాలను రైల్వే ఇవ్వలేకపోతోంది. ఈ ఘటన రైల్వే వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని విమర్శకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications