ఒకసారి తప్పుచేశారు..11 వచ్చాయి,ఈసారి అవికూడా రావు..!!
అమరావతి: తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే... జైలుకు పంపుతామన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. సమాజంలో ఇలాంటి వారు నాయకులుగా చెలామణి కావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులతో మా చంద్రబాబును ఒక్కసారి జైలుకు పంపినందుకే రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టారని గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.ప్రజలు అధికారం ఇచ్చేది పగలు, ప్రతీకారాలు తీర్చుకునేందుకు కాదనే విషయం వైసీపీ నాయకులు గుర్తించాలని హితవు పలికారు. ఈ విషయం గుర్తించి ఉంటే కనీసం వైసీపీ కి ప్రతిపక్ష హోదా అయినా దక్కేదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశతో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని... అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడం కేవలం కలలోనే సాధ్యమని మంత్రి గొట్టిపాటి దుయ్యబట్టారు.

శుక్రవారం రోజున విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబును తిరిగి జైలుకు పంపుతామని అన్నారు.కాకినాడ పోర్టు విషయంలో కేవీరావు సీఐడీకి విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ కేవీ రావును తానెప్పుడూ కలవలేదని మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి... ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. అయితే ఫిర్యాదు స్వీకరించిన సీఐడీ సాయిరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిరెడ్డి తాము అధికారంలోకి వస్తే చంద్రబాబును జైలుకు పంపుతామంటూ వ్యాఖ్యానించారు.
ఇక నిన్న విజయ్ సాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు 75 ఏళ్ల వయసున్న వ్యక్తి నాయకత్వం అక్కర్లేదని, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ముందుకెళ్లాలని ఎక్స్ వేదికగా సంచలన పోస్టు వేశారు.












Click it and Unblock the Notifications