అమరావతి రైతులకు నిధులు, చంద్రబాబు సంతకం
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రెండో సంవత్సర కౌలు చెల్లింపుల ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది 10 శాతం కౌలు పెంచి చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో రైతులు ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై అధికార వర్గాలు లెక్కలు తేల్చాయి.
సీఆర్డీఏ అదనపు డైరెక్టర్(ఐటీ) రూపొందించిన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. వాటిని సీఎం చంద్రబాబు ఆమోదం కోసం పంపించారు. ఈ వారంలోనే ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ విడుదలవుతుందని, ఆ వెంటనే రైతులకు బ్యాంకు చెక్కులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ఏడాది ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే చెక్కులు పంపిణీ చేశారు. రెండో ఏడాది వార్షిక చెల్లింపుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. చట్ట ప్రకారం ఈ ఏడాది ఎకరానికి జరీబు రైతులకు అయితే రూ.55 వేలు, మెట్ట రైతులకు రూ.33 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది.

వీటి ఆధారంగా రైతులకు చెల్లించాల్సిన మొత్తం లెక్కించగా రూ.142 కోట్ల నిధులు అవసరం. గుంటూరు కలెక్టరేట్‌లోని సీఆర్డీఏ పరిపాలన అధికారులు ఆదివారం జేసీ శ్రీధర్‌కు నివేదించారు. దీంతో పాటుగా సంక్షేమం, పెన్షన్లకు మరో రూ.70 కోట్ల నిధులు అవసరం కానున్నాయి.
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో ముందే నోట్ ఫైలుపై ఆమోద ముద్ర వేయించారు. బడ్జెట్ విడుదల కాగానే బ్యాంకు చెక్కులు/డీడీల రూపంలో రైతులకు రెండో ఏడాది కౌలు చెల్లించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటుగానే వ్యవసాయ కూలీలకు పెన్షనను చెల్లిస్తారు.












Click it and Unblock the Notifications