రేవంత్ ఇష్యూ, ఫోన్ల ట్యాపింగ్: ఒకేసారి ఢిల్లీకి ముగ్గురు, గవర్నర్ వద్దకు బాబు
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుకు తోడు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర ముఖ్య అధికారుల ఫోన్ ట్యాపింగ్ దుమారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది.
చంద్రబాబు సహా పలువురి ఫోన్లను తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధమని తెరాస నేతల పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
దీంతో టీడీపీ, తెరాసల గొడవ రసవత్తరంగా మారింది. రేవంత్ రెడ్డి వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్.. రేవంత్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తారని చెబుతున్నారు.

గవర్నర్ నరసింహన్ ఈ నెల 9వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన 10, 11, 12 తేదీల్లో ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన 11వ తేదీ వరకైనా ఢిల్లీలో ఉంటారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ రేవంత్ వ్యవహారం విషయంలో కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే 9వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చునని చెబుతున్నారు.
అయితే, 10వ తేదీన చైనా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కావాల్సి ఉందని, దానికోసమే ఢిల్లీకి వెళ్తున్నారని ఏపీ అధికారులు చెబుతున్నారు. చైనా ప్రతినిధులతో భేటీ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్తారని అంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రానికి ఇప్పటికే ఏపీ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, కేసీఆర్ 12వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్ వ్యవహారంపై కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది. ఒకే వారంలో గవర్నర్, ఇరువురు సీఎంలు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం గమనార్హం.
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలుస్తున్నారు. ఉదయం నుంచి కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడి నుండి హైదరాబాదుకు బయలుదేరారు. హైదరాబాద్ నుండి నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్‌తో సమావేశమవుతారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications