గవర్నర్‌కు షడ్రుచులతో విందు: స్వీటు బాక్సు ఇచ్చి వీడ్కోలు పలికిన బాబు
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి నవ్యాంధ్ర రాజధానిగా ప్రస్తుతం సేవలందిస్తోన్న విజయవాడలో అడుగుపెట్టిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మరుపురాని ఆతిథ్యం లభించింది.
బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్న గవర్నర్‌కు అధికారులు అక్కడి గేట్ వే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అప్పటికే తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తాజ్ గేట్ వే హోటల్‌కు వెళ్లి గవర్నర్‌ను తన కారులో కూర్చోబెట్టుకుని లింగమనేని హౌస్‌కు తీసుకెళ్లారు.

లింగమనేని హౌస్‌కు చేరుకున్న తర్వాత గవర్నర్‌ను చంద్రబాబు అక్కడ ఉన్న ఓ అద్దాల గదిలోకి తీసుకెళ్లారు. ఈ గదిలోని అద్దాల్లోంచి కృష్ణా నది పవరళ్లతో పాటు విద్యుద్దీపాల వెలుగులోని విజయవాడను చూసే అవకాశం ఉందట. ఈ గదిలో ఇద్దరూ సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు.
ఈ భేటీలో హైకోర్టు విభజనపై తాజా పరిణామాలు, తెలంగాణ ప్రభుత్వ వాదన, కేంద్ర వైఖరి తదితర అంశాలను గవర్నర్ ఆయనకు వివరించారు. దీనిపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు గవర్నర్‌కు చెప్పారు. 'నేను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినవాడిని. ఇరు రాష్ట్రాలు సర్దుకుపోవాలని కోరుకునే వాళ్లల్లో నేను మొదటివాడిని. గతంలో కూడా నేనే మిమ్మల్ని కోరి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం పెట్టించాను.' అని అన్నారు.
Welcomed AP & Telangana Governor Sri E.S.L Narasimhan garu and elaborated on our initiatives for development of AP. pic.twitter.com/DVtZ6u90ua
— N Chandrababu Naidu (@ncbn) July 6, 2016
దీంతో పాటు 'తెలంగాణ ప్రభుత్వం తనకు ఆసక్తి ఉన్న సమస్య మాత్రమే పరిష్కరించాలని కోరడంతో అసలు సమస్య వస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల విభజన ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరస్పరం స్తంభింప చేసుకొనేంత వరకు వివాదాలు నడుస్తున్నాయి.' అని చెప్పారు.

'దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మేము ఎన్ని సార్లు కోరినా దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. నదీ జలాలకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక దానిని కాకుండా అన్నీ కలిపి సమగ్రంగా పరిష్కరించుకుంటే ఇరు రాష్ట్రాలకు మంచిది. మీరు కూడా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడండి. మీరు చొరవ తీసుకొని వివాదాలు పరిష్కరించండి' అని చంద్రబాబు గవర్నర్‌ను కోరారని తెలుస్తోంది.
దీనికి గవర్నర్ స్పందిస్తూ ఈ విషయంలో పట్టువిడుపులతో వెళ్లాలని సూచించారు. ఒకేసారి అన్ని వివాదాలు పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చునని, ముందు హైకోర్టు విషయం ఎక్కువగా నలుగుతున్నందు వల్ల దాని నుంచి ప్రారంభించి పరిష్కరించుకుంటూ వెళ్దామని సూచించారట.
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలపై తాము ప్రతిసారీ సుప్రీంకోర్టుకు వెళ్లటం సాధ్యం కాదని, హైకోర్టు ఉమ్మడిగా ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నది తమ అభిప్రాయమని చంద్రబాబు పేర్కొన్నారు. వివాదాలన్నీ పరిష్కారం అయితే హైకోర్టు విడిపోయినా ఇబ్బంది ఉండదని అందుకే ముందుగా వివాదాలపై దృష్టి పెట్టాలని తాము కోరుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

బుధవారం ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలపైనే గురువారం మరోసారి గవర్నర్, చంద్రబాబు నడుమ భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు ఖరారైన కార్యక్రమం ప్రకారం గవర్నర్ గురువారం ఉదయం 7 గంటలకు మంగళగిరిలోని పానకాల స్వామి దేవాలయాన్ని, 8 గంటలకు కనకదుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. 10 గంటలకు వెలగపూడి వెళ్లి అక్కడ నిర్మాణమవుతున్న ఏపీ సచివాలయ భవనాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతి వెళ్లే ముందు మధ్యాహ్న భోజన సమయంలో మరోసారి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. తన నివాసానికి వచ్చిన గవర్నర్‌కు చంద్రబాబు తన కుమారుడైన లోకేశ్‌ను పరిచయం చేశారు.
కాగా గవర్నర్ నరసింహాన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మరుపురాని విందు ఇచ్చారని తెలుస్తోంది. ఈ విందులో గవర్నర్ కోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన మెనూకు సంబంధించి చంద్రబాబు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తిగా శాకాహారి అయిన నరసింహన్ కు పంచభక్ష్య పరమాన్నాలతో చంద్రబాబు విందు ఇచ్చారు.
బుధవారం రాత్రి జరిగిన విందులో నరసింహన్ ముందు టేబుల్ పై 15 రకాలు ఐటమ్స్ వచ్చి చేరాయట. వాటిలో క్యారెట్ బొబ్బట్లు, గారెలు, పూర్ణం బూరెలు, పచ్చి శనగపప్పు గోంగూర కూర, టమోటా కొత్తిమీర చట్నీ, ఆంధ్రా గోంగూర చట్నీ, దొండకాయ, బీరకాయ చట్నీ, మిక్స్ డ్ వెజిటబుల్ కూర, ఉలవచారు, ముద్దపప్పు, మునక్కాయ, బెండకాయ కూరలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు, సాంబారు, రసం ఉన్నాయి.
భేటీ అనంతరం కారు వద్దకు వచ్చి మరీ గవర్నర్ నరసింహాన్‌ను చంద్రబాబు సాగనంపారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతిలో చంద్రబాబు ఓ పెద్ద స్వీట్ బాక్సును కూడా అందజేశారు. అందులో ఆంధ్రా మిఠాయిలు... కాకినాడ కాజాలు, అరిసెలు, బందరు లడ్డూలు, బెల్లం, పంచదార పూతరేకులు, కజ్జికాయలు, సున్నుండలతో పాటు బెంగాలి మిఠాయి రసగుల్లాలు ఉన్నాయట.
ఇక ఈ గిఫ్ట్ ప్యాక్‌తో పాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన శ్రీవారి ప్రసాదాన్ని కూడా గవర్నర్ నరసింహాన్‌కు చంద్రబాబు అందజేశారు.












Click it and Unblock the Notifications