సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగ పాఠం
అమరావతిలో తొలిసారి సమావేశాలు సంతోషకరమని అన్నారు. అతి తక్కువ సమయంలో అసెంబ్లీ భవన నిర్మాణం జరిగింది. కొత్త అసెంబ్లీలో ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి.
అమరావతి: అమరావతిలో తొలిసారి సమావేశాలు సంతోషకరమని అన్నారు. అతి తక్కువ సమయంలో అసెంబ్లీ భవన నిర్మాణం జరిగింది. కొత్త అసెంబ్లీలో ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయి. సోమవారం ఉదయం 11.06గంటలకు ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండున్నరేళ్లలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
2022 నాటికి ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతామని గవర్నర్ తెలిపారు. 2020కల్లా దేశంలోని మూడు ఉత్తమ రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందని చెప్పారు. 2050కల్లా దేశంలో పెట్టుబడుల్లో ఏపీ కీలక స్థానంలో ఉంటుందని చెప్పారు. రికార్డు సమయంలో పట్టిసీమను పూర్తి చేశామని చెప్పారు.

'వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 24శాతం వృద్ధి సాధించాం. తక్కువ వర్షపాతం ఉన్నా వ్యవసాయంలో అధిక వృద్ధి సాధించగలిగాం. పారిశ్రామిక వృద్ధిరేటు 9.58శాతం నమోదైంది. సేవారంగంలో మరింత వృద్ధి, ఉపాధి అవకాశాలకు ప్రయత్నిస్తున్నాం. తోటపల్లి, గండికోట ప్రాజెక్టులు నిర్దేశిత కాలంలో పూర్తవుతాయి. వెలుగొండ సహా పలు ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.' అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
'అనుకున్న సమయాని(2019)కి పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వర్షపాతం తక్కువగా ఉన్నా.. వ్యవసాయ అభివృద్ధి సాధిస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఎదుగుతోంది' అని గవర్నర్ చెప్పారు.
'పెద్ద నోట్ల రద్దును ప్రభుత్వం సమర్థిస్తోంది. 2018 నాటికి రాష్ట్రంలో 4లక్షల గృహాలు నిర్మిస్తాం. అత్యంత సాంకేతికతతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్షోభాన్ని సవాలుగా తీసుకున్నాం. రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైల్వే జోన్ తెచ్చేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం' అని గవర్నర్ నర్సింహన్ వివరించారు.
'విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తున్నాం. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం అందిస్తున్నాం. అవినీతికి అవకాశం లేకుండా చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ క్లస్టర్‌గా తిరుపతి అభివృద్ధి. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బహిరంగ మల విసర్జన లేని మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింద'ని తెలిపారు.
'ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న ఆరోగ్య రక్ష పథకాల కింద పేదలకు మంచి వైద్య సదుపాయం. ఎన్టీఆర్ గ్రామీణ గృహ వసతి పథకం కింద పేద వర్గాలకు గృహ వసతి కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అనాథ మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక సాయమందిస్తున్నాం. 11లక్షల మందికిపైగా వెనకబడిన తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాం' అని తెలిపారు.
'ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ. 149కే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సదుపాయాలు కల్పిస్తున్నాం.
విజయవాడ చుట్టూ 110 కి.మీల హైస్పీడ్ సర్కులర్ సబర్బన్ రైలు. విశాఖను అంతర్జాతీయ ప్రాముఖ్యత గల ఫిన్‌టెక్‌గా అభివృద్ధి చేస్తున్నామ'ని తెలిపారు.
విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54లక్షల కోట్లు విలువైన 665 ఎంఓయూలు కుదిరాయని, దీనిని వల్ల 22.34లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
'జూన్ నాటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. అసంఘటిత కార్మికులకు భోరసా కల్పిస్తున్నాం. చేనేత కార్మికుల రుణ విముక్తి కోసం రూ.110 కోట్లను కేటాయిస్తున్నాం. రాయితీ ద్వారా అన్నం అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఈబీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తున్నాం' అని గవర్నర్ తెలిపారు.
దేశంలో ఏపీని అగ్రగామి రాష్ట్రంగా, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ గవర్నర్ నర్సింహన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications