సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్, 7వ రోజు పోటెత్తిన భక్తులు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో ఏడవరోజైన సోమవారం పెద్ద సంఖ్యలో యాత్రీకులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ తన సతీమణితో కలసి వచ్చి రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు.
నడుములోతు నీటిలో దిగి సంకల్పం చెప్పుకుని, మూడు సార్లు గోదావరి నీటిలో మునిగారు. అనంతరం సూర్య నమస్కారాలు చేశారు. ముందుగానే అక్కడికి చేరుకున్న అధికారులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి, స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇక ఏడో రోజు పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాలు కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్‌ల భక్తులతో జనసంద్రమయ్యాయి.
పుష్కరాలకు వచ్చే భక్తులు ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వీరికి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో టీటీడీ రోజు లక్ష ఆహార పొట్లాలు అందించాని నిర్ణయం తీసుకుంది. కాగా, రాజమండ్రి, సామర్లకొట నుంచి పుష్కరాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.
సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున పుష్కరస్నానాన్ని ఆచరిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకూ రాజమండ్రిలోని వివిధ ఘాట్లలో 5 లక్షల మందికిపైగా స్నానమాచరించినట్టు అధికారులు వివరించారు.
ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్లిన గవర్నర్ దంపతులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా బయలుదేరి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న గవర్నర్ దంపతులు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు.
అనంతరం అక్కడి నుంచి ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె గ్రామానికి బయలుదేరారు. అక్కడ పుష్కరస్నానం చేసిన అనంతరం భద్రాచలం స్వామివారిని దర్శించుకుంటారు.












Click it and Unblock the Notifications