లోకేశ్ ఆపరేషన్ ఆకర్ష్: కడపలో జగన్ దిద్దుబాటు చర్యలు?
అమరావతి: తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలను నిలుపుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారా? అంటే అవుననే అంటున్నారు. కడపలో కూడా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో వైయస్ జగన్ త్వరగానే మేల్కొన్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత వైయస్ జగన్ లోటస్ పాండ్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అసలెందుకు పార్టీ మారుతున్నారనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలలో ఆత్మస్థైర్యం నింపేందుకు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రాబాబు నీతిమాలిని రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని జగన్ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. టీడీపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఎంతో నమ్మకంగా ఉన్న భూమా నాగిరెడ్డి లాంటి వారు పార్టీ మారడంతో జగన్ ఆవేదన చెందారని తెలుస్తోంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు ఏం చేయాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జిలను నియమించనున్నారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల ప్రయోజనం లేదని, ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని, టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామా అని జగన్ ఎమ్మెల్యేలతో చెప్పనున్నట్లు తెలుస్తోంది.
జగన్ కంచుకోటగా ఉన్న కడపలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేశ్ లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతుండగా మరోవైపు జగన్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
జగన్ నిర్వహించిన సమావేశానికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గైర్హాజరు కావడం గమనార్హం. ఇప్పటికే వీరిద్దరూ కూడా టిడిపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో కనీసం ఫోన్లో మాట్లాడాలని జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. తాజాగా వీరిద్దరూ కూడా టీడీపీలోకి చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో కడపలో పార్టీకి భారీ నష్టం జరుగుతుందని అంచనా. ఈ క్రమంలోనే జగన్ కడప వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
గురువారం కడప జిల్లాలో పర్యటించి, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తల్లో భరోసా నింపేందుంకు ప్రయత్నించారు. వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన పర్యటనలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని కడప పట్టణం, ఎర్రగుంట్ల, మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, ఆలంఖాన్‌పల్లె ఇలా అన్నిచోట్లకు ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తలకు పూర్తి భరోసాను కల్పించారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ మాజీ సభ్యడు, వైసీపీ ప్రముఖ నేత మైసూరారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications