చంద్రబాబుకు శుభవార్త వినిపించిన నరేంద్రమోడీ
ఏపీ ప్రజలకు కేంద్రం తియ్యటి శుభవార్తను వినిపించింది. రాష్ట్రంలోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించబోతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల దూరం ఉంది. నిర్మాణానికి రూ.884 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరించబోతున్నారు. ఈ లైను అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
పూర్తి కావొస్తున్న విజయవాడ-గూడూరు మూడో లైను
ప్రాజెక్టులో భాగంగా రెండు రైల్వే వంతెనలు, అండర్ పాస్ లు నిర్మిస్తారు. విజయవాడ-గూడూరు మధ్య ఇప్పటికే నిర్మిస్తున్న మూడో లైను దాదాపు పూర్తికావస్తోంది. దక్షిణమధ్య రైల్వేలో గూడూరు-రేణిగుంట సెక్షన్ కీలకమైంది. గూడూరు నుంచి చెన్నైకి ఒక మార్గం, రేణిగుంట-తిరుపతివైపు మరో మార్గం ఉంది. చెన్నై-హౌరా ప్రధాన రైల్వేలైనులో ఇది కీలకం. రేణిగుంట నుంచి చెన్నైవైపు, గుంతకల్లువైపు రెండు మార్గాలున్నాయి. గూడూరు నుంచి విజయవాడ, విశాఖ, కటక్ మీదగా హౌరా, విజయవాడ నుంచి ఖాజీపేట మీదుగా హైదరాబాద్ వైపు, విజయవాడ నుంచి ఖాజీపేట మీదుగా ఢిల్లీవైపు కీలక మార్గాలున్నాయి.

గూడూరు కీలకమైన జంక్షన్
రైల్వే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారి అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఎక్కువ రైళ్లను స్టేషన్ బయటే నిలిపివేయాల్సి వస్తోంది. అంతేకాకుండా క్రాసింగ్స్ కోసం కొన్ని స్టేషన్లలో నిలపాల్సి వస్తోంది. విజయవాడ-గూడూరు, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. దీనివల్ల రైళ్లను ఎక్కడా నిలపాల్సిన అవసరమే రాదు. గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ స్టేషన్లలో ప్లాట్ ఫామ్స్ ఖాళీ లేక గంటల తరబడి ఔట్ స్కర్ట్స్ లోనే రైళ్లు నిలిచేవి. ఇప్పుడు ఆ అవసరం తప్పుతోంది.












Click it and Unblock the Notifications