మరికొన్నిగంటల్లో పెళ్లి .. పత్రికలు ఇవ్వబోయి మృత్యుఒడిలోకి ...
నందలూరు : మరికొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఇటు తల్లిదండ్రులు, అటు చేసుకోబోయే వధువు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ లేరనే విషయాన్ని పేరెంట్స్, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైలు ప్రమాదం తమ ఇంటి దీపాన్ని ఆర్పివేసిందని గద్గత స్వరంతో రోదిస్తున్నారు.
పత్రికలు ఇవ్వబోయి ...
పక్క ఫొటోలు కనిపిస్తోన్న వ్యక్తి పేరు కాశీ శ్యాం. కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పరిధిలోని అరవపల్లె తోటపాలెం స్వస్థలం. ఈ నెల 12వ తేదీన కాశీ శ్యాం పెళ్లి ఉంది. దీంతో బంధువులు, స్నేహితుల కోసం తానే స్వయంగా పెళ్లి పత్రికలు పంచుతున్నాడు. మరో రెండురోజుల్లో పెళ్లి అనగా .. ఆదివారం మృత్యువు కబళించింది. నిన్న ఇంటి నుంచి వెళ్లిన .. కాశీ శ్యాం తిరిగిరానిలోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

ఇంటినుంచి .. తిరిగిరాని లోకాలకు ...
పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు నిన్న ఇంటినుంచి బయల్దేరాడు కాశీ శ్యాం. మధ్యాహ్నం 3.30 గంటలకు నందలూరు అల్విన్ కంపెనీ సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వెళ్తుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కాశీ శ్యాం రైలు కింద పడిపోయాడు. దీంతో రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు.
వాహనం వచ్చి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా .. కాళ్లు విరగడంతో తీవ్రగాయాలైన కాశీ శ్యాం మార్గమధ్యలోనే చనిపోయాడు. మరో రెండురోజుల్లో పెళ్లి ఉండగా మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అమ్మాయి తరఫు బంధువులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. కొన్ని గంటల్లో పెళ్లి అనగా .. అబ్బాయికి ఇలా జరిగిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.












Click it and Unblock the Notifications