'నేను స్ధానికుడిని... ఎక్కడినుంచో వలస రాలేదు'
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేధాలు మరోసారి బయటపడ్డాయి. మొన్నటికి మొన్న అధికారుల బదిలీ వ్యవహారంపై మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు బహిరంగంగానే విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల మధ్య వివాదం నెలకొంది.
మాడుగుల నియోజక వర్గంలో మంత్రి అయ్యన్నపాత్రుడు రూ. 6.31 కోట్ల విలువైన భారీ ఎత్తున అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు శుక్రవారం ప్రారంభించనున్నారు. స్ధానిక ఎంపీ లేకుండా ఎలా శంకుస్ధాపనలు చేస్తారంటూ ఎంపీ అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్‌కే లేఖ ఇవ్వడంతో పాటు అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ హెచ్చరికలు చేశారు.

మరోవైపు అయ్యన్నపాత్రుడి పర్యటనను చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలయత్నం చేస్తోంది. దీంతో మాడుగులలో అయ్యన్న పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మాడుగులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం మాడుగుల నియోజక వర్గంలో వివిధ కార్యాక్రమాలకు హాజరైన మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తాను వ్యాపారవేత్తను కానని, పార్టీలు మారే తత్వం తనకు లేదని గంటా శ్రీనివాసరావు పేరు చెప్పకుండా అయ్యన్న వ్యాఖ్యానించారు.
తాను ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన క్రమశిక్షణ గల నేతనని అన్నారు. తాను స్ధానికుడినని, ఇతర నేతల మాదిరిగా ఎక్కడినుంచో వలస రాలేదన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు విశాఖ తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications