ఏపీ.. దుమ్ములేపింది - నవంబర్‌లో రికార్డు స్థాయి ఆదాయం ..!!
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 11 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 14 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య ఎనిమిది శాతానికే పరిమితమైంది.

ఐజీఎస్టీ వాటా..
నవంబర్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,45,867 కోట్ల రూపాయలు. గత ఏడాది నవంబర్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య 11 శాతం అధికం. 2021 నవంబర్‌లో నమోదైన జీఎస్టీ వసూళ్లు 98,708 కోట్ల రూపాయలు. కాగా- ఈ ఏడాది అదే నవంబర్‌లో 1,45,867 కోట్లకు చేరింది ఈ రెవెన్యూ. జీఎస్టీ రాబడి 1,40,000 కోట్లను దాటుకోవడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రేకప్ ఇదీ..
ఇందులో సీజీఎస్టీ వాటా 25,681 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 32,651 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 77,103 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. సెస్ రూపంలో అందిన మొత్తం 10,433 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 817 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో పెరుగుదల..
కాగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల 14 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నవంబర్‌లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 2,750 కోట్ల రూపాయలు. కాగా ఈ సంవత్సరం అదే నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 3,134 కోట్ల రూపాయలకు పెరిగాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఆరు శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 8 శాతంగా నమోదైంది. తెలంగాణలో కిందటి నెలలో జీఎస్టీ వసూళ్లు 4,228 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇదే నెలలో 3,931 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో అందాయి.

రాష్ట్రాలవారీగా..
రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.430 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.67 కోట్లు, పంజాబ్-రూ.1,669 కోట్లు, చండీగఢ్-రూ.175 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,280 కోట్లు, హర్యానా-రూ.6,769 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-4,566 కోట్లు, రాజస్థాన్-3,618 కోట్లు, ఉత్తర ప్రదేశ్-రూ.7,284 కోట్లు, బిహార్-రూ.1,317 కోట్లు, సిక్కిం-రూ.209 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.62 కోట్లు, నాగాలాండ్-రూ.34 కోట్లు, మణిపూర్-రూ.50 కోట్లు, మిజోరం-రూ.24 కోట్లు, త్రిపుర-రూ.60 కోట్లుగా నమోదయ్యాయి.

మహారాష్ట్రలో..
మేఘాలయ-రూ.162, అస్సాం-రూ.1,080 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,371 కోట్లు, జార్ఖండ్-రూ.2,551 కోట్లు, ఒడిశా-4,162 కోట్లు, ఛత్తీస్‌గఢ్-2,448 కోట్ల రూపాయల మేర జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి. మధ్యప్రదేశ్-రూ.2,890 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.304 కోట్లు, గుజరాత్-9,333 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.21,611 కోట్లు, కర్ణాటక-రూ.10,238 కోట్లు, గోవా-రూ.447 కోట్లు, కేరళ-రూ.2,094 కోట్లు, తమిళనాడు-రూ.8,551 కోట్లు, పుదుచ్చేరి-రూ.209 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.23 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications