వివేకా హత్యకేసులో సీబీఐ సీబీఎన్‌తో కలిసి.. ఆ విషయంలో చంద్రబాబుకు గుడివాడ అమర్‌నాథ్ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివేకా హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తుండడం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. వివేకా హత్య కేసులో అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్య జరిగిందని, హత్యచేసిన వారెవరో జగన్ కు ముందే తెలుసని టిడిపి నాయకులు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. సీబీఐ ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని పేర్కొనడంతో టిడిపి నాయకుల మాటల దాడి మరింత ఎక్కువైంది. దీనిపై వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

సీబీఐ పై సంచలన ఆరోపణలు చేసిన గుడివాడ అమర్‌నాథ్
తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అనేది సీబీఎన్ తో కలిసి పని చేస్తుందని గుడివాడ అమర్‌నాథ్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. కావాలనే ఈ కేసులో జగన్ పై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు బయటపడాలంటే చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కాల్ డేటా లను పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. వీరిని విచారిస్తే అసలు విషయం బయట పడుతుందని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

లోకేష్ బాబాయ్ రామ్మూర్తి నాయుడు సంగతేంటి
వివేకా హత్య కేసులో సీఎం జగన్ పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేయడానికి లోకేష్ కు నైతిక హక్కు లేదని అమర్‌నాథ్ మండిపడ్డారు .లోకేష్ బాబాయ్ రామ్మూర్తి నాయుడు సంగతేంటని సూటిగా ప్రశ్నించారు. మీ బాబాయ్ ని గొలుసులతో బంధించి ఇంట్లో ఎందుకు చంద్రబాబు దాచాడో చెప్పాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రామ్మూర్తి నాయుడు ఎలాంటి నిజాలు బయట పెడతాడో అని భయపడే పిచ్చివాడని ముద్ర వేసి గొలుసులతో కట్టేసి దాచిపెట్టారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అంతమాత్రాన నువ్వు ఎన్టీఆర్ వారసుడివి కాలేవని మండిపడ్డారు.

తండ్రి, కొడుకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేయాలని సవాల్
పొత్తుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని, పవన్ కళ్యాణ్ మీద లేని ప్రేమను ఒలకబోస్తున్నారు అని విమర్శించారు. తండ్రి, కొడుకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు గుడివాడ అమర్‌నాథ్. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించి ఇప్పుడు నీతి సూక్తులు చెప్తున్నారు అంటూ మండిపడ్డారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. ఇక టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చచ్చిన పాము అని పేర్కొన్న ఆయన, ఆయన ఎక్కువగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు, లోకేష్ లు ఎన్ని రేటింగ్స్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఓ సున్నా
ఇదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్నారని మండిపడిన ఆయన రీమేక్ సినిమా అయినా భీమ్లా నాయక్ కోసం చంద్రబాబు, లోకేష్ లు ఎన్ని రేటింగ్స్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఓ సున్నా అంటూ గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు, అఖండ సినిమా గురించి చంద్రబాబు ఎందుకు ట్వీట్లు పెట్టలేదని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మీద వల్లమాలిన ప్రేమను చూపించటం వెనుక కారణం అందరికీ తెలుసని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications