
గుడివాడలో హరికృష్ణ ఓడిపోవడానికి కొడాలి నానీయే కారణం?
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ ఇన్ ఛార్జి రావి వెంకటేశ్వరరావు మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అన్ స్టాపబుల్-2 కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూపై రాష్ట్రంలో రాజకీయ చర్చ నడుస్తోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూపై స్పందించిన కొడాలి నాని.. బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని చంపిన చంద్రబాబుతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం దారుణమణి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రావి వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ బిడ్డల గురించి నాని దారుణంగా మాట్లాడుతున్నారని, ఆయన్ను గుడ్డలూడదీసి కొడతామంటూ హెచ్చరించారు. నానిని జైలుకు పంపకపోతే తాను చెవులు కోసుకుంటానంటూ శపథం చేశారు.

కొడాలి జీవితం మొత్తం కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిందని, కాళ్లు పట్టుకుని అడుక్కోవడంతోనే చంద్రబాబు అప్పట్లో టికెట్ ఇచ్చారనే విషయాన్ని గుర్తుచేశారు. గుడివాడలో హరికృష్ణను ఓడించింది కూడా కొడాలి నాననీయేనన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే కొడాలి నాని గ్యాంగ్ అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. కొడాలి నాని తన అవితీని సొమ్మును విశాఖపట్నం తరలించారని, ఎక్కడ పెట్టుబడి పెట్టారో తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని రావి తెలిపారు. వాటిని త్వరలోనే బయట పెడతానని చెబుతుండటం ఇప్పుడు గుడివాడలో కలకలం రేకెత్తిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనే గట్టి పట్టుదలతో పార్టీ ఉంది. అక్కడ ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావును నియమించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి.