ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ రోగులకు శుభవార్త... 75వేల విలువ చేసే పరీక్షలు ఉచితం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి వైద్య రంగంలోనూ అనేక మార్పులు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా క్యాన్సర్ రోగులకు శుభవార్త చెప్పారు ఏపీ వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో తొలిసారి అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు.
గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ప్రత్యేక టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 22న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రూ.2.5 కోట్ల వ్యయంతో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో మొదట రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. క్యాన్సర్ కణాల్లో జన్యు మార్పులను గుర్తించి, రోగి జన్యు ప్రొఫైల్ ఆధారంగా సరైన చికిత్సను వైద్యులు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇటువంటి పరీక్షల కోసం నమూనాలను బెంగళూరు, ముంబైకి పంపాల్సి వస్తోంది. అయితే ఇకపైన ఈ పరీక్షలు ఏపీలోనే జరుగుతాయి.
ప్రైవేట్ కేంద్రాల్లో రూ.20 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చయ్యే ఈ పరీక్షలు రోగులకు ఇకపై ఏపీలోని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉచితంగా అందిస్తారు. రెండేళ్లలో 2,000 నమూనాలు పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖర్చును ఆస్ట్రాజెనెకా భరిస్తుంది.రొమ్ము క్యాన్సర్‌లో BRCA1, BRCA2 మార్పులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో EGFR, KRAS వంటి మార్పులను గుర్తిస్తారు.
భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తిస్థాయి కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి జన్యు సమాచార వ్యవస్థతో అనుసంధానించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కార్య రూపం దాలిస్తే ఇది క్యాన్సర్ రోగులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ పైలెట్ కేంద్రం సక్సెస్ అయితే రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి స్థాయి కేంద్రం ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.













Click it and Unblock the Notifications
