ఘోరం.. మెడ కొరికేసిన కుక్క, నాలుగేళ్ల బాలుడు మృతి
గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్‌లో గోపీ అనే బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాలుడి మెడను కొరికేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే బాలుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో కుక్కల గుంపు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నామంటున్నా వీధి కుక్కలు మాత్రం ఏదో ఒక చోట చిన్నాపెద్దా తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి.

నదిలో మునిగి ముగ్గురు మైనర్లు మృతి
కృష్ణా జిల్లాలో పండగపూట విషాద ఘటనచోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు మైనర్లు మృతి చెందారు. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి మత్తి వెంకట గోపి కిరణ్(15), ఎం వీరబాబు(15), ఎం వర్ధన్(16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి మృతి చెందిన బాలుర తల్లితండ్రులను ఓదార్చారు. పండగపూట ముగ్గురు యువకుల మృతితో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications