నాగార్జునలో వరంగల్ విద్యార్థిని మృతి: బలవంతంగా బాహుబలి సినిమాకు!
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఆమె వరంగల్ జిల్లాకు చెందిన బిటెక్ విద్యార్థిని రిషికేశ్వరి. ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని చెబుతున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో ఆమె రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన పైన ప్రాథమిక విచారణలో సీనియర్ల ర్యాగింగ్ నేపథ్యంలో రిషికేశ్వరి సూసైడ్ చేసుకుందని తేలింది. దీంతో రిషికేశ్వరి పైన ర్యాగింగ్‌కు పాల్పడినట్లుగా భావిస్తున్న ముగ్గురు సీనియర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, రిషికేశ్వర్ పైన ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్లను వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. రిషికేశ్వర్ పైన ర్యాగింగ్‌కు పాల్పడిన మూడో వ్యక్తి విద్యార్థిని. ఆమె రిషికేశ్వరితో కలిసి ఒకే గదిలో ఉంటోందని చెబుతున్నారు. సీనియర్ అబ్బాయిలతో చనువుగా ఉండాలని రిషికేశ్వరి పైన ఆమె ఒత్తిడి చేసిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె పేరు అనీష అని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, బాయ్ ఫ్రెండ్స్‌తో దగ్గరగా ఉండాలని రిషికేశ్వరిని అనీష బెదిరించేదని తెలుస్తోంది. ఆదివారం అనీష... తన బాయ్ ఫ్రెండ్స్ కోసం రిషికేశ్వరిని బలవంతపెట్టి బాహుబలి చిత్రానికి తీసుకెళ్లిందని తెలుస్తోంది. రిషికేశ్వరి సినిమా మధ్యలోనే బయటకు వచ్చి, పిన్ని ఇంటికెళ్లిందని తెలుస్తోంది.
రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పైన ప్రత్యేక దర్యాఫ్తు చేపట్టినట్లు అర్బన్ ఎస్పీ త్రిపాఠి తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలను అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.












Click it and Unblock the Notifications