జగన్ ను ఓడించాలంటే - చంద్రబాబు దిగిరాక తప్పదు: తెర పైకి కొత్త ఫార్ములా..!!
టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖరారు సాధ్యం కావాలంటే ఏం జరగాలో కొత్త ఫార్ములా తెర మీదకు వచ్చింది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కొత్త ఆలోచనలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిసిస్తున్నా..చోటు చేసుకుంటున్న పరిణామాలతో కొంత డైలమా కనిపిస్తోంది. ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పొత్తులపైన క్లారిటీ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. బీసీ నేతలతో సమావేశమైన పవన్.. కాపు సేన నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖరారు సాధ్యం కావాలంటే ఏం జరగాలో కొత్త ఫార్ములా తెర మీదకు వచ్చింది, పవన్ కల్యాణ్ సమక్షంలోనే ఈ ప్రతిపాదన జరిగింది.

టీడీపీ వ్యూహాత్మకంగా ప్రచారం
పవన్ కల్యాణ్ కాపు సేన నేతలతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీతో జత కట్టటానికి జనసేన భే షరతుగా మద్దతిస్తోందంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తోందన్నారు. జనసేనకు 20 సీట్లు ఇవ్వనున్నారని..ఇందుకు పవన్ అంగీకరించినట్లుగా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును సీఎం చేయటానికి పవన్ సిద్దంగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయని సమావేశంలో పేర్కొన్నారు. అధికారంలోకి రావటానికి వైసీపీ ఎన్ని వ్యూహాలు అమలు చేస్తుందో..అధికారం దక్కించుకోవటానికి టీడీపీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోందని జోగయ్య విశ్లేషించారు. కన్నా లక్ష్మీనారాయణ..మహాసేన రాజేష్ లాంటి వారు జనసేనలో చేరకుండా టీడీపీలో చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ ను ఓడించాలంటే పవన్ ను సీఎం చేయాలి
టీడీపీ అధికారంలోకి రావాలంటే పవన్ కల్యాణ్ కీలకమని జోగయ్య పేర్కొన్నారు. ఇందు కోసం కొత్త ప్రతిపాదన చేసారు. జగన్ ను గద్దె దించాలంటే చంద్రబాబు దిగి రాక తప్పదన్నారు. పవన్ ను సీఎం చేస్తేనే జగన్ ను ఓడించటం సాధ్య పడుతుందని చెప్పారు. చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు. పవన్ ను సీఎం చేస్తేనే టీడీపీ - జనసేన మధ్య సయోధ్య సాధ్యం అవుతుందని పవన్ సమక్షంలోనే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలో లోకేష్ ను భాగస్వామిని చేయాలని జోగయ్య పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం పైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇతర కులాలతో సమన్వయం చేసుకుంటూ అందరి పార్టీగా జనసేన నిలవాలని పలువురు నేతలు సూచించారు.

టీడీపీ అందుకు సిద్దమేనా..
2014 ఎన్నికల తరహాలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం. ఇప్పటి వరకు బీజేపీ అందుకు సుముఖంగా లేదు. జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్నా.. జనసేన సొంతంగా హామీలు..నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇదే సమయంలో పవన్ సమక్షంలోనే పొత్తుల పైన జోగయ్య లాంటి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ ను సీఎం చేస్తేనే పొత్తు ఉంటుందనే వ్యాఖ్యలు ఆయన మద్దతు దారుల నుంచి వినిపించాయి. ఇక, పార్టీ ఆవిర్భాబ సభలో పవన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో వస్తున్న ప్రతిపానదల నడుమ పవన్ ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక..జోగయ్య లాంటి నేతల డిమాండ్ పైన టీడీపీ స్పందన తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications