ఏది మంచిదైతే అదే కేంద్రం ఇస్తుంది: హరిబాబు, జగన్ జైలుకేనని పల్లె
విజయవాడ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీనా.. రాష్ట్రానికి ఏది మంచిదో అదే కేంద్రం ఇస్తుందని తెలిపారు. హోదాపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.
విశాఖ రైల్వేజోన్ ఫైల్‌ను కేబినెట్ అనుమతికి పంపామని తెలిపారు. విశాఖలో త్వరలో డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనను అందరూ స్వాగతిస్తున్నారని హరిబాబు అన్నారు. రికార్డు సమయంలో పట్టిసీమ పూర్తి చేయడంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రెట్టింపు వేగంతో పోలవరంను పూర్తి చేయాల్సిన బాధ్యత బాబుదేనని ఆయన తెలిపారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్ని దీక్షలు, ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విషయం మీద కూడా అవగాహన లేదని ఆయన దుయ్యబట్టారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శుక్రవారంనాడు యుఎస్ కాన్సులేట్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు హెచ్ -1 వీసాలను పెంచాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications