చిత్తూరుకు నిధులు: సిఎంపై హైకోర్టులో హరీష్ పిటిషన్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేహరీశ్ రావు హైకోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. నీటి కోసం 4,300 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు కేటాయించుకున్నారనే అభియోగాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. హరీశ్‌రావు తన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. హరీశ్ రావు పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
తెలంగాణ భవన్‌లో మంగళవారం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కిరణ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని హరీశ్ రావు ఆరోపించారు. వైద్య ఆరోగ్యానికి సంబంధించి ముగ్గురు మంత్రులున్నా వారి మధ్య సమన్వయం లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏ పాలసీ లేదని, చేతగానోడికి మాటలు ఎక్కువ అన్నట్లు కిరణ్ వైఖరి ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించని ఫైళ్లు మాత్రమే కదులుతున్నాయని హరీశ్ రావు అన్నారు.
ముఖ్యమంత్రికి రచ్చబండలో రాజకీయాలు చేసేందుకు సమయం ఉంటుంది గానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఫైళ్లు చూడడానికి మాత్రం టైమ్ దొరకడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం ఏడాదిలో ఏ ఒక్క బిసి, ఎస్సి, ఎస్టికి రుణాలు ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 104, 108 ఉద్యోగులను వైద్య విధాన పరిషత్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం ఎవరితో సాధ్యమవుతుందో వారిని ఎన్నుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.












Click it and Unblock the Notifications