సిఎం 6 రన్సే చేస్తారు, జగన్‌ను ఎలా వదిలారు: హరీష్
నిజామాబాద్: చివరి బంతి వరకు ఆట ముగియదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గురువారం మండిపడ్డారు. చివరి బంతి అంటే పార్లమెంటులో బిల్లు పెట్టడమే అన్నారు. నాలుగు వందల మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్నారు.
చివరి బంతికి కేవలం ఆరు పరుగులే తీయగలరని ఎద్దేవా చేశారు. తద్వారా తమ గెలుపు ఖాయమైందన్నారు. ముఖ్యమంత్రి పెవిలియన్‌కు దారి పట్టే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ వారిని ఓడించడానికి ఎన్ని మ్యాచ్ ఫిక్సింగులకు పాల్పడినా ప్రజలు తిప్పికొట్టారన్నారు. సీమాంధ్ర నేతలు శ్రీకృష్ణ కమిటీని కూడా మేనేజ్ చేశారని ఆరోపించారు.

హైదరాబాదు పైన చర్చకు ఎలాంటి అవకాశం లేదన్నారు. తెలంగాణ కోసం దీక్ష చేసిన తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును జైల్లో పెట్టాలని, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన జగన్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తల్లి సమన్యాయం అంటే కొడుకు సమైక్యాంధ్ర అంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.
హైదరాబాదు పైన పూర్తి హక్కులు, అధికారం తెలంగాణకే ఉన్నాయన్నారు. అందుకే ఈ నెల 29న సకల జన భేరీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేసే నాయకుడిని అడుగు పెట్టనీయమన్నారు. జగన్‌ను లోటస్ పాండు నుండి ఇడుపులపాయకే పంపిస్తామన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలంగాణకు ఉందా లేదా చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications