Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు రావడంతో రోడ్లన్నీ నదుల్లా ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీకర వరదలు సంభవించాయి. అయితే ఈ వరదల్లో ఓ మానవీయ ఘటన జరిగింది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ బైకర్ ప్రాణాలను ఓ నవ వధువు చాకచక్యంతో వ్యవహరించి కాపాడింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ బైకర్ కు తన చున్నీ ఇచ్చి అతడ్ని రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నవ వధువును ప్రశంసిస్తున్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ఓ కుటుంబం చూపిన చొరవ.. ఆ నవవధువు ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, భటియత్ జిల్లాల్లో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉప్పొంగుతోంది. దాంతో అక్కడి రోడ్లు, ఇతర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కకియారా- తునుహట్టి రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇదే సమయంలో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న మామ్లా గ్రామానికి చెందిన ఓ బైకర్ వరదనీటిలో చిక్కుకుపోయాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తన ద్విచక్ర వాహనంతో పాటు కొద్ది దూరం కూడా కొట్టుకుపోయాడు. ఇక అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టును పట్టుకుని వరదనీటిలోనే నిలబడిపోయాడు.
అదే సమయంలో ఓ కుటుంబం అప్పుడే పెళ్లి వేడుకలను ముగించుకుని అటుగా వెళ్తోంది. అయితే వరదలో చిక్కుకున్న ఆ బైకర్ ను చూసి ఆ కుటుంబం చలించింది. వెంటనే తమ కారును ఆపి అందులోని ఓ వ్యక్తి బైకర్ ను కాపాడేందుకు ముందుకు వెళ్లాడు. అయితే నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ముందుకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.
Best video to start the day ❤️A newly married couple in Bhatiyat, Chamba, risked their own safety to save a young biker who was stuck in a flash flood. It was literally a matter of seconds before he could have been swept away.The newlywed bride gave her dupatta, and together the… pic.twitter.com/xcfTk69HHz
— Nikhil saini (@iNikhilsaini) September 1, 2026
దాంతో కారులో ఉన్న నవ వధువు వెంటనే సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. తన చున్నీ తీసి వరదలో చిక్కుకున్న బైకర్ వైపు విసిరింది. ఆ చున్నీని బైకర్ పట్టుకోగా కారులోని ఇతర మహిళలు బైకర్ ను ఒడ్డుకు లాగారు. అలా బైకర్ ప్రాణాల్ని కాపాడారు. ఈ సాహసోపేతమైన చర్య మొత్తం వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నవవధువు సమయస్ఫూర్తి.. ఆ కుటుంబం మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications