బెదరను, తిప్పికొడుతా: కిరణ్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి మాటలకు తాను బెదరబోనని, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే అవాస్తవాలను తిప్పికొడుతూనే ఉంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. అదుపులో ఉండంటూ కిరణ్ కుమార్ రెడ్డి సభలో తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. తన సందేహాలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడారని, తాను ఆ మాటలకు బెదరబోనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలను, కుట్రలను ఎదుర్కోవడం తన బాధ్యత అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యే వరకు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే అవాస్తవాలను ఎదుర్కుంటూనే ఉంటానని ఆయన అన్నారు.
శానససభలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినదాంట్లో కొత్త విషయమేమీ లేదని, పాత పాటే మళ్లీ మళ్లీ పాడారని ఆయన అన్నారు. శాసనసభను ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరపాలని ఆయన కోరారు. సభను అడ్డుకోకుండా ముసాయిదా బిల్లుపై చర్చ జరపాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ, సీమాంధ్ర విడిపోతే నీళ్ల పంపకాల్లో ఇబ్బందులు వస్తాయని అంటున్నారని, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఇబ్బంది ఉంటుందని అంటున్నారని, సక్రమమైన ప్రాజెక్టులైతే ఏ విధమైన ఇబ్బంది ఉండదని, అక్రమంగా కట్టిన ప్రాజెక్టుల విషయంలో ఇబ్బంది వస్తుందని ఆయన అన్నారు.

హంద్రీనీవా, పులిచింతల, కండలేరు, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులు సక్రమమైనవైతే ఏ విధమైన ఇబ్బందీ రాదని, మిగులు జలాలు చూపించి ఆ ప్రాజెక్టులు కట్టారని, తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించకుండా తెలంగాణ నోరు కొట్టి నీటిని తరలించుకుపోయారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బంది వస్తుందని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన అన్నారు. తమపై ముఖ్యమంత్రి సానుభూతి, కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 1250 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా 300 టిఎంసిలు కూడా అందడం లేదని, రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఎక్కువ నీళ్లు వస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్తుకు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటున్నారని, తెలంగాణ రైతులు బోర్లకూ విద్యుత్ కనెక్షన్లకూ బిల్లుల చెల్లింపునకూ 40 వేల కోట్లు ఖర్చు చేశారని, ఆంధ్రలో మాదిరిగా ప్రభుత్వ నిర్వహణలో కాలువల ద్వారా నీరు అందిస్తే తెలంగాణ రైతులకు ఆ కష్టం ఉండేది కాదని ఆయన అన్నారు. దొంగ రాత్రి కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు ప్రమాదాల్లో మరణించారని, నక్సైలైట్లని భావించి రైతులను పోలీసులు కాల్చేసిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.
సింగరేణి బొగ్గు విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో రాష్ట్రవాటా కూడా ఉందని ఆయన అన్నారు. బొగ్గు పంపిణీ విషయంలో రాయలసీమ, ఆంధ్రలను విభజించి చూపుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications