జగన్ పథకాల ఎఫెక్ట్- ఏపీలో సగానికి తగ్గిపోయిన పేదలు ? సాయిరెడ్డి సంచలన ట్వీట్..
ఏపీలో నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కంటే సంక్షేమం మీదే భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. ఖజానాలో డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. అయితే ఈ ప్రభావం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలపై స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. భారీ ఎత్తున అమలు చేస్తున్న పథకాల కారణంగా రాష్ట్రంలో పేదరికం సగానికి తగ్గిపోయింది.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం పేదరికంపై ఏ విధంగా ఉందనే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఫలితాన్నిస్తున్నాయని తెలిపారు. ఐదేళ్లలో ఏపీలో సగం పేదలు తగ్గిపోయారన్నారు. 11.77 శాతం నుంచి 6.06 శాతనికి పేదరికం తగ్గిపోయిందన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో భారీగా పేదల సంఖ్య తగ్గిపోయినట్లు ఆయన వెల్లడించారు.

తాజాగా దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడినట్లు తాజాగా నీతి ఆయోగ్ ఓ నివేదిక వెలువరించింది. ఇందులో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ రాష్ట్రాలు ముందున్నట్లు కూడా నీతి ఆయోగ్ తెలిపింది. ఇప్పుడు ఏపీలోనూ గత ఐదేళ్లలో పేదరికం సగానికి తగ్గిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా చెప్పడంతో ప్రభుత్వ పథకాలపై మరోసారి చర్చ జరుగుతోంది.

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ను కూడా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఏపీకి ఇచ్చిన 10 శాతం లోపు పేదరికం టార్గెట్ ను తాము అధిగమించామని, ఇప్పుడు కేవలం 6.06 శాతం పేదలు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. అలాగే చివర్లో పెత్తందారుల ఆగడాలు రాష్ట్రంలో సాగవన్నారు. తద్వారా విపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము పథకాలతో పేదరికం తగ్గిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications