చరిత్ర సృష్టించిన వైసీపీ- జగన్ బర్త్‌డే రోజున..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ 50వ పుట్టిన రోజును జరుపుకొంటోన్నారు. దేశంలోనే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా గుర్తింపు పొందారాయన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఆయనకు అభినందనలు తెలియజేస్తోన్నారు.

బర్త్‌డే శుభాకాంక్షల హోరు..
వైఎస్ జగన్ 50వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకొంటోన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తోన్నారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది. ఆయనకు విషెస్ చెబుతూ వేర్వేరు హ్యాష్ ట్యాగ్స్‌తో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. అదే స్థాయిలో వీడియోలు రీట్వీట్లు అవుతున్నాయి.

సేవా కార్యక్రమాలు..
దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. జగన్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తోన్నారు. అటు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కేక్ కటింగ్..
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు ఆర్ కే రోజా, విడదల రజిని, తానేటి వనిత, జోగి రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాలకు గుర్తింపు..
కాగా- వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద సామూహిక రక్తదాన శిబిరాలుగా పేరు తెచ్చుకుంది. ఈ మేరకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి దీన్ని ఎక్కించినట్లు ప్రతినిధి వెల్లడించారు. 1,29,451 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు చెప్పారు. 30,000పైగా యూనిట్ల రక్తాన్ని వారు దానం చేసినట్లు వివరించారు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డికి అందజేశారు.












Click it and Unblock the Notifications