పులివెందుల ఎన్నికల్లో టర్నింగ్..! వైసీపీకి హైకోర్టు బిగ్ షాక్..!
ఏపీలో జరుగుతున్న పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో విపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే వైసీపీ దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపి ఊరటనిచ్చిన హైకోర్టు.. మరో పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో వైసీపీకి ఒకే రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పోలింగ్ కు ఒక్క రోజు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాలు పులివెందుల తీర్పుకు టర్నింగ్ పాయింట్ అయినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్ లను మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్ లను అలాగే ఉంచి అందులో ఓటర్లను వేరే బూత్ లకు మార్చేశారు. దీంతో ఓటర్లు దూరంగా ఉన్న పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పులివెందులలో పోలింగ్ బూత్ ల మార్పును వ్యతిరేకిస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో జరిగిన విచారణలో ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. జడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం ఆరు పోలింగ్ బూత్ లు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకున్న ఈసీ లాయర్.. పోలింగ్ కు 24 గంటల ముందు దీన్ని మార్చలేమని తేల్చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. దీంతో హైకోర్టు కూడా ఈసీ వాదనను సమర్థిస్తూ వైసీపీ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ మేరకు పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది.

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. కేవలం 10600 ఓట్లు ఉన్న ఈ జడ్పీటీసీ స్ధానానికి జరుగుతున్న ఎన్నికలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికే ప్రచార పర్వం ముగిసింది. ఇక్కడ పోలింగ్ బూత్ లన్నీ సమస్యాత్మకమేనని ఎస్పీ ప్రకటించారు. దీంతో రేపు జరిగే పోలింగ్ లో ఏం జరగబోతోందన్న టెన్షన్ రాజకీయ పార్టీల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications