యువగళం పాదయాత్ర డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి: నారా లోకేష్ బెదిరింపు వల్లేనంటూ..
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర విధి నిర్వహణలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మరణించారు.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్ర ప్రారంభం నాడే నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
తాజాగా- నారా లోకేష్ పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువగళం పాదయాత్ర బందోబస్తు విధుల్లో పాల్గొనన హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో ఈ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గంగాధర నెల్లూరులో భోజనానికి విరామం తీసుకున్నారు నారా లోకేష్. అక్కడే భోజనం తిన్న కొద్దిసేపటికే హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గమనించిన తోటి పోలీసులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రికి తీసుకుని రావడానికి ముందే రమేష్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అంతకుముందు- నారా లోకేశ్ పాదయాత్రలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నారా లోకేష్, ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంసిరెడ్డిపల్లెలో లోకేష్ ప్రసంగిస్తోన్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆయన పోలీసులు ఘాటు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంతు చూస్తానంటూ బెదిరించారు. జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికల వల్లే హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తోన్నారు.












Click it and Unblock the Notifications