40 ఏళ్ల వయసులోకి వచ్చారా - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!
ప్రతీ ఒక్కరికి వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. 40 ఏళ్ల వయసు నుంచి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా బయట పడుతూ ఉంటాయని చెబుతున్నారు. ఈ వయసులోనే కొన్ని ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...కొద్ది పాటి శారీరక వ్యాయామంతో వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. జీవన సరళిలో చేసుకోవాల్సిన మార్పులను నిపుణులు సూచిస్తున్నారు.
జీవితం 40 ఏళ్ళకి ముందు ఒకలా, ఆ తరువాత మరొకలా ఉంటుందనేది వాస్తవం. కుటుంబ..ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరగటం వల్ల, శరీర మార్పుల వల్ల, రకరకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం కావడం మొదలవుతుంది. అందుకే ఆ వయసుకి రాగానే మన జీవన సరళిలో మార్పులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. నాలుగు పదుల వయసు వచ్చేసరికి కండరాల్లో సాంద్రత తగ్గుతూ ఉంటుంది. రక్త సరఫరా కూడా నెమ్మదిస్తుంటుంది కాబట్టి, దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

నిత్యం తీసుకొనే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. అన్నం పరిమాణాన్ని తగ్గించాలి. తాజాఫలాలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి. కంటిచూపు మందగించకుండా విటమిన్ ఎ, సి ఉండే పదార్థాలు తినాలి. మారుతున్న కాలంలో ప్రతీ ఒక్కరికి అలవాటుగా మారిన మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి. ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే నీళ్ళు బాగా తాగాలి.వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ చూసుకోండి. ఫ్యాట్ ఉంటే కరిగించాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో బలహీనంగా ఉంటే బరువు పెంచుకోవటం అవసరం. విటమిన్ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక, ప్రతీ ఒక్కరూ రోగనిరోధకశక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రశాంతంగా ఉంటూ తగినంత నిద్ర పోవడం అవసరం. ఈ జాగ్రత్తలు ప్రతీ ఒక్కరికి అవసరమనేది నిపుణుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications