వీటిని పాటించి ఆరోగ్యంగా ఉండండి- డాక్టర్ బాబు హెల్త్ టిప్స్
Chandrababu: ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్పు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, దీనికోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రోజూ అరగంట వాకింగ్ చేయడం, అలాగే దైవ చింతనతో ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.
యోగా వారసత్వ సంపద..
మన దేశ వారసత్వ సంపద అయిన యోగాను ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్‌ను దూరం పెడితే క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు తగ్గుతాయని అన్నారు. జంక్ ఫుడ్, ఫాలిష్డ్ బియ్యం తినడం తగ్గించి మిల్లెట్స్, ముడి బియ్యం తీసుకోవడంతో పాటు ఆహారంలో పీచు పదార్థం, కూరగాయలు ఎక్కువగా తినాలని ఆయన సూచించారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా..
జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను సోమవారం సచివాలయంలో పవర్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందించాలన్నది తమ ఆలోచన అని పేర్కొన్నారు. హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
600 గ్రాముల ఉప్పు వాడితే..
నలుగురు ఉన్న కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు వాడితే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, వంటనూనె నెలకు రెండు లీటర్లు, చక్కెర మూడు కేజీల కన్నా ఎక్కువ వినియోగించకుండా చూసుకోవాలని అన్నారు. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు.
ఉప్పు వినియోగం తగ్గిస్తే..
ఉప్పు వినియోగం తగ్గిస్తే 40 శాతం మేర గుండెపోట్లు తగ్గుతాయి. కేరళ ప్రభుత్వం షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రకటించింది. తమిళనాడులో రేషన్ షాపుల్లో గ్లూకోజ్ టెస్టులకు స్ట్రిప్స్ ఉచితంగా ఇస్తున్నారు. ఏపీలో క్లీన్ కుక్ స్టవ్ పంపిణీ కింద అంగన్వాడీలకు గ్యాస్ స్టవ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.
డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ మోడల్..
డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ మోడల్ కింద సింగపూర్‌లో అక్కడి ప్రభుత్వం ఇళ్లకు ప్రత్యేక పెయింట్ వేసి దోమల బెడద లేకుండా చేస్తోంది. దోమలను నివారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున న్యూట్రిఫుల్ యాప్ డెవలెప్ చేశాం. దీనికి స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం 4 లక్షల మంది ఈ యాప్‌ను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.
పురుగు మందుల వినియోగం తగ్గాలి..
రైతులు పంటలకు పురుగు మందుల వినియోగం తగ్గించాలని, వీటి వాడకం వల్ల పంజాబ్ క్యాన్సర్ కేపిటల్ అయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం నేడు పురుగు మందుల వినియోగంతో అనారోగ్యం పాలైందని పేర్కొన్నారు. అందుకే మన రాష్ట్రంలోని రైతుల్లో చైతన్యం తెచ్చి ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, పాఠశాల విద్య నుంచే ఆహారపు అలవాట్లపై చైతన్యం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
డిజి లాకర్‌లో హెల్త్ రికార్డులు..
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల జారీలో ఏపీ ముందుంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 88 శాతం మంది ప్రజలకు హెల్త్ అకౌంట్లు రూపొందించాం. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా 'డిజిటల్ నెర్వ్ సెంటర్' ఏర్పాటు చేస్తున్నాం. ఫేజ్ 2 లో చిత్తూరు జిల్లా, ఫేజ్ 3లో రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
26 నెలల్లో ఈ వర్చువల్ ఆసుపత్రులు..
26 నెలల్లో ఈ వర్చువల్ ఆసుపత్రులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. హెల్త్ రికార్డులు రూపొందించి డిజిటల్ లాకర్‌లో పెడతాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని చిన్నతనం నుంచే ట్రాకింగ్ చేస్తాం. కాలాన్ని బట్టి వ్యాధులు ఎప్పుడు వస్తాయో ప్రజలకు అలెర్ట్ సందేశాలు పంపేలా రూపకల్పన చేస్తాం. మొబైల్ వైద్య వాహనాల ద్వారా ఇంటివద్దే పరీక్షలు చేయిస్తాం. డాక్టర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సేవలందిస్తారని చంద్రబాబు వివరించారు.
టాటా, గేట్స్ తో కలిసి..
టాటా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో వైద్య రంగంలో ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి టెక్నాలజీ, ప్రాక్టీసెస్‌ను ఇక్కడికి తీసుకొస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తాం. 175 నియోజకవర్గాలకుగాను 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, లేని 105 నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు..
ఆరోగ్య సేవలను ప్రజలకు దగ్గర చేయడానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నియోజకవర్గాల్లో నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ విధానంలో నిర్మించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తామని. ఆసుపత్రుల నిర్మాణానికి స్థలంతో పాటు, కొంత రాయితీ ఇస్తామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
మధ్యప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలో దీనిపై అధ్యయనం చేసి ఉత్తమ విధానాన్ని తీసుకొస్తామని, దీంతో ప్రతి నియోజకవర్గంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. వ్యాధులకు సంబంధించి దేశ, విదేశాల్లో ఉండే నిపుణులను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తమ డాక్టర్లను వారికి అనుసంధానం చేసి ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఏం చేశామన్నది సమీక్ష చేస్తాం.
అమరావతిలో మెగా మెడిసిటీ ఏర్పాటు
రాజధాని అమరావతిలో పీపీపీ విధానంలో మెగా గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేస్తాం. కేంద్రం దేశంలో 25 మెడిసిటీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అమరావతిలో మెడిసీటీ నిర్మాణంపై కేంద్రంతో సంప్రదిస్తున్నాం. దీనికి 200 ఎకరాలను కేటాయించి అందులో 100 ఎకరాలు హెల్త్ కేర్, సేవలకు 40 ఎకరాలు, రెసిడెన్షియల్‌కు 40 ఎకరాలు, కమర్షియల్‌కు 20 ఎకరాలు ఇచ్చే విధంగా విధానాలు రూపొందించారని వివరించారు.












Click it and Unblock the Notifications