మబ్బుకు చిల్లులు... ఆంధ్రప్రదేశ్ పై 'ముసురు'
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో కోస్తాతోపాటు తెలంగాణలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని, ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ వర్ష ప్రభావం రానున్న 5 రోజులపాటు ఉంటుందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ఈ సమయంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాలతోపాటు కొండ పక్కన నివాసం ఉండేవారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంవల్ల గోదావరికి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తం కావాలని, వరద ప్రభావం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఉన్నతాధికారులంతా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేయాలని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు.
సహాయక చర్యల కోసం అల్లూరి జిల్లా ఎన్టీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. అలాగే సంస్థ కార్యాలయంలో రెండు స్టేట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. త్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండడానికి రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ప్రకటించారు. మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి కూడా చేయొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications