ఏపీలో భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు అధికారులకు కీలకఆదేశాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శీతాకాలంలోనూ కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తరాంధ్రలో భారీవర్షాలు
ఈ క్రమంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలపైన సీఎంవో అధికారులతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మంత్రి చంద్రబాబు నాయుడు కురుస్తున్న భారీ వర్షాల పైన సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలు కురిసే జిల్లాలలో పరిస్థితులను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలలో వర్షాల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన అధికారులు
ఇక అధికారులు అనేక జిల్లాలలో వర్షాలు పడుతున్న పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అనేది సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు కొన్ని జిల్లాలలో భారీ వర్షాల కారణంగా సెలవులు ప్రకటించారు.
పంటలు దెబ్బ తిన్నాయి..రైతులకు సాయం అందేలా చూడాలన్న సీఎం
ఇక ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించాలన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు సాయం అందేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచన
భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని, తద్వారా రైతులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని స్థాయిలలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.












Click it and Unblock the Notifications