రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు
మండుతున్న ఎండలు.. విపరీతమైన వేడి.. ఉక్కపోత.. వడగాడ్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ తీపి కబురు వినిపించింది. మోస్తరు నుంచి ఒక మోస్తరు వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం నుంచి మూడురోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో కోస్తా, రాయలసీమ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఏడు నుంచి తొమ్మిదోతేదీ మధ్యలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్ష ప్రభావంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంవల్లే వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 12 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో ఉక్కపోత బాగా పెరిగింది. ప్రజలు ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాలని, అది కూడా ఉదయం పూటే పూర్తిచేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు బయటకు రావొద్దని, అత్యవసరమైతే కనీసం గొడుగు ధరించి రావాలని చెబుతున్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ వైద్యుల చెబుతున్న సలహాలు పాటించాలని, దాహం వేయకపోయినప్పటికీ మంచినీరు తాగుతుండాలని అధికారులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications