రాయలసీమ జిల్లాలపై ఉపరితల ఆవర్తనం: ఏపీలో భారీ వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఉపరితల ఆవర్తనం బలపడింది. ప్రస్తుతం రాయలసీమ, పరిసర ప్రాంతాలకు ఇది విస్తరించింది. సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి.
పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications