మరో ముప్పు, దూసుకొస్తోంది - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
వర్షాలు వెంటాడుతున్నాయి. వరద ముంపు నుంచి కోలుకోకముందే వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి. మరో నాలుగైదు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద తగ్గింది. అటు బుడమేరు ప్రవాహం పైన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేడు అల్పపీడనం ఏర్పడనుందనే అంచనాలతో గుంటూరు నుంచి విశాఖ వరకు భారీ వర్షం కురుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మరో హెచ్చరిక
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. రుతుపవన ద్రోణి తూర్పుభాగం రామగుండం, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇంకా కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ.ల నుంచి 7.6 కి.మీ. ఎత్తు మధ్యన ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాకుండా దాని నైరుతి భాగం ఒంగి ఉంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

భారీ వర్షాల అలర్ట్
తర్వాత ఇది ఉత్తర వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి ఏలూరు, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.08లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రభుత్వం అప్రమత్తం
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అటు విజయవాడలో సహాయక చర్యలకు తాజా వర్షం అడ్డంకిగా మారుతోంది. మరోసారి వర్షాల హెచ్చరికలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.












Click it and Unblock the Notifications