Rain alert: రేపు ఏపీలోని ఈ 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వానలు వీడటం లేదు. తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కొడుతుండగా.. ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 5న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు జిల్లాలు మినహా మిగితా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
శుక్రవారం తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుందని అంచనావేసింది.

మరోవైపు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటికే కర్నూలుతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, పంటపొలాల్లోకి వరదనీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.