అహుతి ప్రసాద్ మృతి: కంటతడి పెట్టిన ఆర్టిస్టులు
హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి ఆదివారం నాడు టాలీవుడ్ నటులు నివాళులు అర్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖవాణి, హేమ, సన తదితరులు మాట్లాడారు. ఆహుతి ప్రసాద్ లేరంటే నమ్మలేకపోతున్నామని కంటతడి పెట్టారు.
హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు ఆదివారం నివాళులు అర్పించారు. వారు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మంచివాళ్లను దేవుడు తన దగ్గరకు తొందరగా పిలుచుకుంటాడని, అందుకే ఆహుతి ప్రసాద్‌ను ఆ దేవుడు తీసుకు వెళ్లాడన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఆహుతి ప్రసాద్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆహుతి ప్రసాద్ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు దర్శక రత్న దాసరి నారాయణ రావు, తేజ, బ్రహ్మానందం, గిరిబాబు, కోటా శ్రీనివాస రావు, నాగబాబు, అల్లరి నరేష్, మురళీ మోహన్, రవిబాబు తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి హీరోలు శ్రీకాంత్, అల్లరి నరేష్, నటుడు శివాజీ రాజా, క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖవాణి, హేమ, సన తదితరులు నివాళులు అర్పించారు. ఆయన సహనటుడిగా కంటే కుటుంబ సభ్యుడిగానే భావిస్తామని వారు అన్నారు.
ఆహుతి ప్రసాద్ ఎన్నో సినిమాలలో నటించారు. ఆహుతి సినిమాలో ఆయన పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులను ముగ్దులను చేసింది. ఈ క్రమంలోనే ప్రసాద్‌ను ఆహుతి ప్రసాద్‌గా పిలవడం ప్రారంభించారు. సినీ పరిశ్రమలో మంచి వ్యక్తిగా, నటుడిగా గుర్తింపు పొందిన ఆహుతీ ప్రసాద్ మరణ వార్త విన్న నటీ నటులు, దర్శక నిర్మాతలు షాక్‌కు గురయ్యారు.












Click it and Unblock the Notifications