ఏపీకి ప్రత్యేక హోదా సదస్సులో నిప్పులు చెరిగిన సినీ నటుడు శివాజీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ఏర్పాటు చేసిన సదస్సులో సినీ నటుడు శివాజీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విభజన పట్ల వారి విచారాన్ని వ్యక్తం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదాపై అఖిలపక్షం వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా దక్కాలంటే కేంద్రంతో అఖిలపక్షం మాట్లాడాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల అనంతరం అఖిలపక్షం వేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన చంద్రబాబు, ఈ విషయంపై ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. తామంతా చంద్రబాబు వెనుకుంటామని స్పష్టం చేసినా, ఆయన మాత్రం ముందుకు వెళ్లడం లేదని మండిపడ్డారు.

చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న మంత్రులంతా మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లేనని, వాళ్ల తాతలేమీ జమిందార్లు కాదని దుయ్యబట్టారు. ఈ జీవితం అనిశ్చితితో కూడుకున్నదని, ఎప్పుడు ఎవరుంటారో చెప్పలేమని అన్నారు. ఇప్పుడున్న వాళ్లంతా రామారావు కన్నా మగాళ్లా?, రాజశేఖర్ రెడ్డి కన్నా మగాళ్లా? అంటూ ప్రశ్నించారు.
ఎవరో ఒక పెద్దాయన శివాజీ ఎక్కువ మాట్లాడుతున్నాడు అని నన్ను ఉద్దేశించి కామెంట్ చేసినట్లు తెలిసిందని, రాబోయే రోజుల్లో ఇంతకంటే ఇంకా ఎక్కువగా మాట్లాడతానని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.
'ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత నేను కనిపిస్తే అప్పుడు అడగండి. ఈ ఏరియాలో కూడా కనపడను. అవసరమైతే ఈ దేశంలో కనిపించను. వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, పోతే ప్రాణం. ఇలాంటి వాటన్నింటికి తెగించే నేను ఇక్కడికి వచ్చాను' అని అన్నారు.












Click it and Unblock the Notifications