అమరావతి రైతులకు శుభవార్త
ఈనెల 12వ తేదీ నుంచి ''అసెంబ్లీ టు అరసవెల్లి'' పేరుతో మహా పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులకు హైకోర్టు అమనుతి మంజూరు చేసింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర చేయవచ్చని స్పష్టం చేసింది. దీనిపై అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఇచ్చిన నోటీసులపై రైతులు వేసిన పిటిషన్‌ను మొదటి కేసుగా ధర్మాసనం స్వీకరించింది. రైతులు చేసుకున్న దరఖాస్తును పరిశీలించి వెంటనే అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో రైతులకు అనుమతిని నిరాకరిస్తూ డీజీపీ అర్థరాత్రి సమయంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఈనెల 12వ తేదీతో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 1000 రోజులు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రైతులు 60 రోజులపాటు మహా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఆగస్టు 27వ తేదీన అనుమతి కోరుతూ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు గద్దే తిరుపతిరావు, ఏ.శివారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

దీనిపై జస్టిస్ మానవేంద్రరాయ్ విచారణ జరుపుతూ పాదయాత్ర నిర్వహించేందుకు కోర్టు గతంలోనే అనుమతిస్తూ ఉత్తర్వులిస్తుందని, ఆ ఉత్తర్వుల పరిధిలోకే ఈ వ్యాజ్యం కూడా వస్తుందికదా అని గవర్నమెంట్ ప్లీడర్ మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. డీజీపీ ఉత్తర్వులిస్తారని చెప్పగా వాటిని తమముందుంచాలని ఆదేశించారు. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో జరిగిన పాదయాత్ర సమయంలో కూడా కోర్టు షరతులను ఉల్లంఘించారని, మొత్తం 60 కేసులు నమోదయ్యాయని జీపీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పాదయాత్ర నిర్వహించే జిల్లాల్లో ఎస్పీ నుంచి డీజీపీ సమాచారం తెప్పించుకున్నారని చెప్పగా, శాంతియుతంగా జరిగే పాదయాత్రకు ముందస్తు అనుమతి అవసరంలేదని జస్టిస్ మానవేంద్రరాయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications