హై కోర్టు భవనం కోసం...రాజధాని ప్రాంతంలో న్యాయమూర్తుల అన్వేషణ

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఐదుగురు సభ్యుల హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించింది. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల భవనాలను న్యాయమూర్తుల బృందం పరిశీలించింది. ఈ కమిటీకి జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యన్ నేతృత్వం వహిస్తుండగా జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ సునీల్‌చౌదరి, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి కమిటీ సభ్యులుగా ఉన్నారు.

హైకోర్టుకు భవనం ఎంపిక చేసేందుకు గుంటూరు జిల్లాకు విచ్చేసిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందానికి జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎస్పీ విజయరావు, వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌లు స్వాగతం పలికారు. అనంతరం, హైకోర్టు ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులు, పరిస్థితులను న్యాయమూర్తులు వర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

హైకోర్టు భవనం కోసం...నాగార్జునా యూనివర్శిటీ పరిశీలన...

హైకోర్టు భవనం కోసం...నాగార్జునా యూనివర్శిటీ పరిశీలన...

ప్రభుత్వం ప్రతిపాదించిన హైకోర్టు తాత్కాలిక భవనం కోసం న్యాయమూర్తుల బృందం ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో దూర విద్యాకేంద్రం భవన సముదాయాన్ని సందర్శించి అందులోని గదులు, శానిటరీ సౌకర్యాలు, రోడ్డు మార్గాలు పరిశీలించారు. అనంతరం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో సమావేశమై దూర విద్యా కేంద్రం భవనంలో ఎన్నిగదులు ఉన్నాయి?...భవనం చుట్టూ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయమూర్తుల నివాసానికి అనువైన ప్రాంతాలను కూడా వీరు పరిశీలించారు. తద్వారా అక్కడ హైకోర్టు ఏర్పాటుకు సానుకూల, ప్రతికూల అంశాల గురించి ఒక అంచనాకు వచ్చారు.

ఎఎన్ యు పట్ల...విముఖతా?...

ఎఎన్ యు పట్ల...విముఖతా?...

అయితే...ఎఎన్ యూలో హైకోర్టు ఏర్పాటుకు కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నట్లు హైకోర్టు బృందం అభిప్రాయపడినట్లు సమాచారం. హై కోర్టు భవనం కొరకు కనీసం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం భవనం, మినిమం 25 హాళ్లు ఉండాలని...కానీ దూరవిద్యా భవనం విస్తీర్ణం కేవలం ఒక లక్షా 14 చదరపు అడుగులేనని, హాళ్లు కూడా తగినన్ని లేవని చర్చించుకున్నారట. పైగా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ కు అతి సమీపంలోనే ఎఎన్ యు విద్యార్థినుల హాస్టల్స్ ఉన్నాయన్న విషయం తెలుసుకున్నన్యాయమూర్తులు అక్కడ ఒకవేళ హైకోర్టును ఏర్పాటు చేస్తే వారికి అసౌకర్యం కలుగుతుందని, అలా వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. అనంతరం రెయిన్ ట్రీ పార్క్ భవనాలను కూడా న్యాయమూర్తుల బృందం పరిశీలించింది.

హైకోర్టు...రాయలసీమలో ఏర్పాటు చేయాలి

హైకోర్టు...రాయలసీమలో ఏర్పాటు చేయాలి

ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ హైకోర్టు సాధన కమిటీ కోరింది. ఈ మేరకు శనివారం వర్సిటీలో హైకోర్టు న్యాయమూర్తుల బృందాన్ని కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా కడప బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు బెంచ్‌లను అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గత ఆరు రోజులుగా న్యాయవాది టి. నాగరాజు ఆమరణ దీక్ష చేస్తున్నాడని తెలిపారు. వినతి పత్రం స్వీకరించిన న్యాయమూర్తుల బృందం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత న్యాయవాదులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద నిరసన తెలిపారు.

సచివాలయంలో..

సచివాలయంలో..

హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం వెలగపూడి సచివాలయాన్ని సందర్శించింది. సచివాలయంలోని ఐదో బ్లాకును, అందులోని ఆర్‌అండ్‌బీ వర్క్‌స్టేషన్లను పరిశీలించింది. తక్కువ సమయంలోనే సచివాలయం, శాసనసభ, మండలి భవనాల నిర్మాణం జరిగిన తీరు, వాటి ఆకృతులను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వివరించారు. సచివాలయంలో వసతులపై న్యాయమూర్తుల బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నేలపాడులో తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని 4 ఎకరాల్లో కేవలం ఆర్నెల్లలోనే నిర్మించి ఇస్తామని హైకోర్టు కమిటీకి తెలిపినట్లు సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur: Judges of combined High Court of AP and Telangana statesJustices Rama Subrahmanyam, Praveen Kumar, Sesha Sai,Sunil Chowdary and Justice Satyanarayana Murthy visited Acharya Nagarjuna University and examined the Distance Education Building premises to to set up temporary High Court. The judges discussed about the facilities available at the building.They wentround various rooms in the complex and examined whether the rooms are adequate or not.The team examined the possibilities for setting up of AP High Court on temporary basis at the university. Mean while, A delegation of advocates from Rayalaseema submits a memorandum to the judges seeking establishment of High Court in the region

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి