నిమ్మగడ్డ లేఖల లీక్- కాలేదన్న రాజ్‌భవన్-బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక ఎన్నికల సందర్భంగా గవర్నర్ కు రాసిన లేఖలు లీక్ చేసిన వ్యవహారం కాకరేపుతోంది. ఈ లేఖల ఆధారంగా తనకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ లేఖలు ఎక్క్డడి నుంచి లీక్ అయ్యాయో తేల్చేందుకు హైకోర్టు సిద్ధమవుతుండటం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.

నిమ్మగడ్డ లేఖల లీక్‌పై హైకోర్టు విచారణ
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ సందర్భంగా పదే పదే తనను టార్గెట్ చేస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణపై గవర్నర్ హరిచందన్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రులు ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే అధికారిక రహస్యంగా ఉండాల్సిన తన లేఖ ఎలా లీక్ అయిందో సీబీఐ దర్యాప్తు వేసి తేల్చాలంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్.. గవర్నర్ హరిచందన్‌కు రాసిన లేఖను తీసుకుని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరిద్దరూ ఇరుక్కున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అధికార సంభాషణను ఎలా బయటపెట్టారంటూ వీరిని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఈసీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వీరిద్దరూ వాడిన లేఖ ఎక్కడి నుంచి లీకయిందన్న దానిపై వీరిచ్చే వివరణ ఇప్పుడు కీలకంగా మారింది.

ఇరుక్కున్న రాజ్‌భవన్- లీక్ కాలేదంటూ
తాను గవర్నర్‌కు రాసిన లేఖ లీక్ కావడంపై హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డితో పాటు రాజ్‌భవన్ అధికారులు కూడా బుక్కయ్యారు. ఇప్పుడు మంత్రులతో పాటు రాజ్‌భవన్ ఇచ్చే వివరణ కూడా కేసుకు కీలకంగా మారింది. దీంతో లేఖల లీకేజే జరగలేదంటూ రాజ్‌భవన్ తరఫున గవర్నర్ ముఖ్య కార్యదర్శి మీనా హైకోర్టుకు తెలిపారు. దీంతో నిమ్మగడ్డ గవర్నర్‌కు రాసిన లేఖ ఎక్కడి నుంచి లీకైందనేది మిస్టరీగా మారింది. దీనిపై హైకోర్టు సంతృప్తి చెందకపోతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశముంది.












Click it and Unblock the Notifications