విదేశాల్లో ఉండి వస్తే ఓకేనా, సైన్యంలో పని చేస్తే వద్దా: ఏపీపై హైకోర్టు
హైదరాబాద్/విజయవాడ: విదేశాలలో ఉండి వచ్చిన పిల్లలను స్థానికులుగా గుర్తించినప్పుడు, దేశం కోసం సేవలు అందించిందుకు వివిధ ప్రాంతాలలో పని చేసే సైనికుల పిల్లలను స్థానికులుగా గుర్తించకపోవడాన్ని తెలుగు రాష్ట్రాల హైకోర్టు తప్పుబట్టింది.
దేశం కోసం పని చేసే ఆర్మీ పిల్లలను స్థానికులుగానే గుర్తించి అడ్మిషన్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్జీ రంగా యూనివర్సిటీలను ఆదేశిస్తూ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
రాష్ట్రంలో చదవలేదన్న కారణంతో స్థానిక రిజర్వేషన్లను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రావణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పైవిధంగా తీర్పు చెప్పింది.

పిటిషనర్ తల్లిదండ్రులు ఏపీలోని ప్రకాశం, కర్నూలులో పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేశారని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు. తండ్రికి ఆర్మీలో ఉద్యోగం రావడంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారన్నారు.
2016 ఎంసెట్‌లో 6,553 ర్యాంకు పొంది వృత్తివిద్యా కోర్సుల్లో చేరడానికి వెళ్తే స్థానికతను వర్తింపజేయడంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రిజర్వ్ కానీ కోటాలో పోటీ పడవలసి వస్తోందన్నారు. కోటా వర్తించదని వర్సిటీ లాయర్ చెప్పారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ... దేశానికి సేవలందించే తండ్రితో పాటు దేశమంతా తిరగవలసి వచ్చిందని, దీనికి స్థానికత వర్తింప చేయమన్న దానితో విభేదించింది. వారిని స్థానికులుగానే గుర్తించాలని యూనివర్సిటీలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications