కేంద్రం ఎఫెక్ట్: హోదాపై విచారణ వాయిదా, సుజనా కంపెనీకి సమన్లు జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు హోదా, సాయంపై ప్రకటించే విషయమై కేంద్ర ప్రభుత్వంలో చలనం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ ఏపీ అంశంపై తొలిసారి ఓ సమావేశం నిర్వహించారు.
దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. ఏపీకి హోదా, సాయంపై వరుసగా సోమ, మంగళవారాల్లో అమిత్ షా నివాసంలో భేటీ అయిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్యలు బుధవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.

మోడీతో ప్రత్యేక భేటీ, ఆ తర్వాత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా బెజవాడకు వస్తుండటంతో ఏపీకి సాయంపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి హైకోర్టులో ఏపీకి ప్రత్యేక హోదాపై గతంలో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది.
గురువారం ఉదయం విచారణకు వచ్చిన ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఏపీపై ప్రకటన చేసే వార్తలు వచ్చిన నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు వారం గడువు కావాలని సాక్షాత్తు పిటిషనర్ తరఫు న్యాయవాదులే కోర్టుకు విన్నవించారు. దీంతో వచ్చే బుధవారానికి ఈ విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
కేంద్రమంత్రి సుజనా కంపెనీకి సమన్లు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు!
మారిషస్ బ్యాంకు రుణానికి సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీకి నోటీసులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సుజనా చౌదరి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుజనా కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే... సుజనా యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరాజుకు బుధవారం సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 2న తమ ముందు హాజరుకావాలంటూ కోర్టు న్యాయమూర్తి సదరు సమన్లలో శ్రీనివాసరాజును ఆదేశించారు.
శ్రీనివాసరాజు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ మారిషస్ బ్యాంకు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మారిషస్ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణానికి సంబంధించి అవసరమైన మేర ఆస్తులు కంపెనీ వద్ద ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకే రాజుకు సమన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications