ఇద్దరు ఏపీ ఐఏఎస్ లకు కోర్టు శిక్ష: రోజంతా కోర్టులోనే ..జరిమానా : ఆదేశాలు పాటించలేదంటూ..!!
ఏపీలో పని చేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఇద్దరు అధికారులను రోజంతా కోర్టులోనే ఉండాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు. గత కొంత కాలంగా ఏపీ హైకోర్టు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..డీజీపీ..అధికారులు పలుమార్లు హాజరు కావాల్సి వచ్చింది. ఇక, ఈ వ్యవహారంలో విలేజ్ హార్టికల్చర్ పోస్టుల భర్తీకి 2020 జనవరిలో ఉద్యానవనశాఖ జారీచేసిన నోటిఫికేషన్ వ్యవహారంలో తానిచ్చిన ఆదేశాలు పాటించలేదంటూ.. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి శిక్షతోపాటు రూ. వెయ్యి జరిమానా విధించింది.
విలేజ్ హార్టికల్చర్ పోస్టుల భర్తీకి 2020 జనవరిలో ఉద్యానవనశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడంతో ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు, నోటిఫికేషన్‌ని సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. అధికారులు ఉత్తర్వులు ఆ అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదే కేసులో తొలుత హైకోర్టు ఈ ఇద్దరు అధికారుల కు తొమ్మది రోజుల జైలు శిక్ష..జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీని పైన అధికారులిద్దరూ తమ వయసు..సేవలను పరిగణలోకి తీసుకొని తమను క్షమించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దీంతో..న్యాయమూర్తి తీర్పును సవరించారు. దీని పైన తాజాగా విచారణ చేసిన కోర్టు అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినట్లు కనపడుతోందని వ్యాఖ్యానించింది. మంగళవారం కోర్టు పనిగంటలు ముగిసేవరకు కోర్టులోనే ఉండాలని ఆదేశించింది.
ప్రత్యక్ష హాజరీకి ఆదేశాలు ఇచ్చిన తరువాతే.. కోర్టు ఉత్తర్వులు అమలు చేసే ఇలాంటి అధికారులను దయ చూపిస్తే ఇతర ప్రభుత్వ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందంటూ న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో..అధికారులకు శిక్ష విధిస్తున్నామంటూ..పనివేళలు ముగిసేవరకు కోర్టులో ఉండాలని ఆదేశించారు. రూ. వెయ్యి జరిమానా చెల్లించాలని, ఆ సొమ్మును చెల్లించడంలో విఫలమైతే మూడు రోజులు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ ఆదేశాలిచ్చారు. మరో కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే అంశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ సైతం కోర్టు ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications