ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు: లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బుధవారం చుక్కెదురైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వం తరుపున ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

దీంతో ఆ టెండర్ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే కారణంగా పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.
అక్టోబర్ 31న తిరిగి 'స్విస్ చాలెంజ్'పై హైకోర్టు విచారించనుంది. ఇదిలా ఉంటే సీఆర్‌డీఏ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం స్విస్ ఛాలెంజ్ విధానంలో సాంకేతిక అర్హత బిడ్లు దాఖలు చేసేందుకు గడువు మంగళవారంతో ముగిసింది. కానీ హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ప్రక్రియను సీఆర్‌డీఏ నిలిపివేసింది.












Click it and Unblock the Notifications