వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సునీల్ యాదవ్(ఏ2), ఉమాశంకర్ రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి(ఏ5) కి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ముగ్గురి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. అనారోగ్య కారణాలతో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వీరి బెయిల్‌కు సంబంధించి కొన్ని నెలలుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వీరికి బెయిల్ కు సంబంధించి తాము వివేకా కుమార్తె సునీత ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో శివశంకర్ రెడ్డి ప్రమేయం ఉందనే విషయం నిర్ధారణైందంటూ సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
శివశంకర్ రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, హత్యలో అతని ప్రమేయం ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటుద్వారా తెలుస్తోందంటూ సునీత న్యాయవాది న్యాయమూర్తి ముందు గతంలోనే తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర పోలీసులు సీబీఐకి సహకరించడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు సీబీఐకి ఊరటగా నిలుస్తోంది. వివేకా హత్యకేసు నత్తనడకన సాగుతోందంటూ విమర్శలు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. కొంత మంది వ్యక్తులు అధికారులు ప్రయాణించే వాహనాన్ని ఆపి డ్రైవర్ ను బెదిరించడం, అంతకు ముందు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి రాంసింగ్‌పై కేసులు పెట్టడంలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో వివేకా కేసు దర్యాప్తు నెమ్మదించిందని భావించారు. కానీ సీబీఐ తమ దర్యాప్తునకు సంబంధించిన రెండు ఛార్జిషీట్లను కోర్టుకు అందజేసింది. అందులో ఏ వివరాలున్నాయనేది కొన్నాళ్ల క్రితం ఈ నివేదిక వెలుగు చూశాయి.












Click it and Unblock the Notifications