తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ఇష్యూ !
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయ వైరం మళ్లీ ఉత్కంఠ రేపుతోంది. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతలా వైరం మరింత ముదురుతోంది. ఇప్పుడు వీరి మధ్య కలహాలు మరో మలుపు తిరిగాయి.
హైకోర్టు తీర్పుతో కేతిరెడ్డి ఎంట్రీ..
ఈరోజు ( ఆగస్టు 18, 2025 ) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని.. ఆయనకు భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో 14 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఆయనను తిమ్మంపల్లి నుంచి పోలీసులు తరలించనున్నారు.

ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరం అయితే పోలీస్ ఫోర్స్‌ను వినియోగించాలని కోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. గతంలో న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదని అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
జేసీ వర్గం శివుడి విగ్రహావిష్కరణ..
అయితే అదే సమయంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జేసీ వర్గం పిలుపునిచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ఈ మేరకు విగ్రహావిష్కరణ వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ "ఏమైనా జరిగినా కార్యక్రమం తప్పక జరుగుతుంది" అని జేసీ వర్గం పట్టుబడుతున్నట్టు సమాచారం.
ఇక ఈ పరిస్థితుల్లో తాడిపత్రిలో రెండు వర్గాల మధ్య మళ్లీ తలెత్తే ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బలగాలను మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటానని.. తనని చూసేందుకు పెద్ద సంఖ్యలో రాకండని ప్రజలను కోరారు. వైసీపీ శ్రేణులు కూడా సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications