బ్రహ్మంగారి భక్తుల్లో భయాందోళనలు
ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటింది. ఆ తర్వాత ఇది బలహీనపడింది. అయినప్పటికీ- నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.
వర్షాలు కడప జిల్లాలో విషాదాన్ని మిగిల్చాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన ఇళ్లు నేలకూలింది. భారీ వర్షాలకు కుప్పకూలింది. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో ఉందీ నివాసం. ఈ ఘటన పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్నారు. విషణ్ణవదనంతో ఇంటిని తిలకించారు. అక్కడ ఉన్న బ్రహ్మంగారి చిత్రపటానికి పూజలు చేశారు.

ఈ ఇంటికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. బ్రహ్మంగారు తన భార్య గోవిందమ్మతో కలిసి స్వయంగా ఇక్కడ నివసించారు. బ్రహ్మంగారిమఠానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిని చూడందే వెనక్కి వెళ్లరు. బ్రహ్మంగారు నివసించిన, నడయాడిన ఈ ప్రాంతం ఇది. ఈ ఇంటిని చారిత్రక కట్టడంగా పరిగణించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తోన్నామని, అలా గుర్తించివుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని చెబుతున్నారు. ఈ ఇంటిని పరిరక్షించడంలో ఆయన వారసులు కూడా విఫలం అయ్యారని, దీన్ని పట్టించుకోలేదని వాపోయారు.
తుపాను ధాటికి విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల జిల్లాలు కకావికలం అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ లో భారీగా పంట నష్టం జరిగింది. ఈదురు గాలులు వీయడంతో చేతికి వచ్చిన పంట నేల కొరిగింది. విద్యుత్ సరఫరా స్తంభించిపోవడం వల్ల దివిసీమలో అంధకారం నెలకొంది. 1977 నాటి దివిసీమ ఉప్పెనను తలపించేలా ఈదురు గాలులు భయోత్పాతానికి గురి చేశాయి.












Click it and Unblock the Notifications