రేపు ఏపీలోని ఈ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు-పలు చోట్ల పాక్షికంగా..!
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలపైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్ధలకు అధికారులు ఎక్కడికక్కడ సెలవులు ప్రకటిస్తున్నారు. వర్షాలు, వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి పలు జిల్లాల్లో ఈ సెలవు అమలు కానుంది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో సెలవు ప్రకటించిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవు ప్రకటించారు. అటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం మొత్తం విద్యాసంస్థలు మూతపడ్డాయి.

మరోవైపు విశాఖ జిల్లాపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో అక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రజల్ని సైతం అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించేందుకు వీలుగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.












Click it and Unblock the Notifications